ఒకేసారి ఐదుగురికి ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’

ఒకేసారి ఐదుగురికి ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో విశాల హృదయం చాటుకుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని నిర్ణయించింది. 2019 సంవత్సరానికిగాను రోహిత్‌ శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (మహిళల రెజ్లింగ్‌), రాణి రాంపాల్‌ (మహిళల హాకీ), మనిక బత్రా (మహిళల టేబుల్‌ టెన్నిస్‌), మరియప్పన్‌ తంగవేలు (పారా అథ్లెటిక్స్‌) ‘ఖేల్‌రత్న’ పురస్కారాలకు ఎంపికయ్యారు.

గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన షట్లర్‌ పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్, నాలుగో స్థానం పొందిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన షూటర్‌ జీతూ రాయ్‌లకు ఈ అవార్డు అందజేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘ద్రోణాచార్య’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఎనిమిది మందికి… ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డును అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.

గత సోమ, మంగళవారాల్లో రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జస్టిస్‌ ముకుందకం శర్మ సారథ్యంలోని 12 మంది సభ్యుల అవార్డుల సెలెక్షన్‌ కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం ఐదుగురిని, ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని… కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని… ప్లేయర్‌ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్‌’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది.

ఇందులో ‘అర్జున’ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 2016 ‘ఖేల్‌రత్న’ అవార్డీ సాక్షి మలిక్‌… 2018 ‘ఖేల్‌రత్న’ అవార్డీ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌) నామినేషన్స్‌ను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించి మిగతా అందరి పేర్లకు ఆమో దం తెలిపింది. ఇప్పటికే అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నందున సాక్షి మలిక్, మీరాబాయి చాను పేర్లను ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ కోసం పరిగణించలేదు.