చిన్న పిల్లలలో పెరుగుతున్న కంటి వ్యాధులు

చిన్న పిల్లలలో పెరుగుతున్న కంటి వ్యాధులు

ప్రస్తుత కాలంలో ఎక్కువ సమయం కంప్యూటర్‌ స్క్రీన్, మొబైల్‌ ఫోన్‌ ముందు గడపడం వల్ల చిన్న పిల్లలలో కంటి వ్యాధులు పెరుగుతున్నట్లు చెన్నైలోని డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆసుపత్రి సీనియర్‌ పీడియాట్రిక్‌ ఆప్తల్మాలజిస్ట్‌ డాక్టర్‌ మంజులా జయకుమార్‌ తెలిపారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధులు రోజు రోజుకు అధికమవుతున్నాయని ఆమె వెల్లడించారు.

బుధవారం ఉదయం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్‌–19 కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం కావడం, ఎక్కువసేపు కంప్యూటర్‌ గేమ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. దీంతో కంటి రెప్పలు తరచుగా మూతపడడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా సూర్యరశ్మికి దూరం కావడం, తగిన వ్యాయామం లేకుండా పోవటం వల్ల కంటి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు.

నేత్ర సంరక్షణ అవగాహన మాసంగా ఆగస్టు నెలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. తగిన సమయంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే కంటి వ్యాధుల నుంచి దూరం కావచ్చునని అన్నారు. తల్లిదండ్రులు తగిన రీతిలో ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ చిన్న పిల్లల కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె హితవు పలికారు.