వర్మ భలే మ్యాజిక్ చేస్తున్నాడే…!

Lakshmi NTR RGV Talks About NTR Character

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ గా ఉంటూ యథార్థ సంఘటనల ఆధారంగా నిమాలు చేసే వర్మ ఆయా సినిమాల్లో పాత్రల ఎంపికలో వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నిజజీవిత వ్యక్తులే నిజంగా తెరపై కనిపిస్తున్నారా అన్నంతగా వర్మ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలోనూ వర్మ అంతే జాగ్రత్త తీసుకుంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రకు ఈయన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు కొన్ని నెలలపాటు వర్మ శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ మేనరిజం, హావభావాలు, మాట్లాడే తీరు ఇలా ప్రతి విషయంలో పూర్తి శిక్షణ ఇచ్చి సినిమాలో నటింపజేసినట్లు వర్మ స్వయంగా వెల్లడించారు. ఇక లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తున్నారు. ముఖ్యమైన చంద్రబాబు నాయుడు పాత్రలో ‘వంగవీటి’ సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ కనిపించనున్నారు.

ఫిబ్రవ‌రిలో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసిన వ‌ర్మ ఒకవైపు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుతూనే మ‌రోవైపు ప్రమోషన్ చేసుకుంటున్నారు. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌‌లుక్, రెండు పాటలతో పాటు చంద్రబాబు, లక్ష్మీపార్వతి పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయాలను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వర్మ ప్రకటించారు. ఇప్పుడు చిత్రానికి సంబంధించి రెండు ఫోటోలను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో ఓ ఫోటోలో అన్నగారు కుర్చీలో కూర్చొని ఆలోచనలో ఉన్న స‌మ‌యంలో ఆయన వద్దకు ల‌క్ష్మీ పార్వతి న‌డిచొస్తున్నట్టుగా ఉంది. రెండో ఫోటోలో తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా లక్ష్మీ పార్వతి భోజనం వడ్డిస్తున్నట్టుగా ఉంది. ఈ రెండు ఫొటోలు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో వర్మ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.