ఎన్నికల్లో ఓడిస్తే వారికే నష్టమట…!

Bjp MLA Vishnukumar Raju Says Not To Quit Bjp

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కొద్ది రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తెలియదు అనే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన బీజేపీకి దూరం అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆయన ఈ వార్తలకు చెక్ పెట్టారు. అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది నేతలు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీ ఖాళీకాదని 40 లక్షల మంది సభ్యులున్నారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు. అంతేకాకుండా టీడీపీ జనసేన పొత్తు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే జగన్‌, పవన్‌ అని విమర్శించిన టీడీపీ ఇప్పుడు పవన్‌ను తీసేసి కేసీఆర్‌ను చేర్చిందని టీడీపీ నేతలు పవన్‌ ని విమర్శించడం మానేశారని దీంతో పవన్‌ గాలి కూడా కాస్త మారినట్లు కనిపిస్తోందని అన్నారు. మోడీ చేతుల్లో పవన్‌ ఉన్నాడని చెప్పిన టీడీపీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందని ట్విస్ట్‌లు, యూటర్న్‌లకు టీడీపీ పెట్టింది పేరని త్వరలో చంద్రబాబు మరో యూ టర్న్ తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం ఇవ్వడంలేదని కడప ఉక్కు, రామయపట్నం పోర్టులకు శంఖుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు కేంద్రం రైల్వేజోన్‌ ప్రకటించలేదని సొంతంగా ప్రకటిస్తారేమో? అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లు పెంచారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని అవినీతి కుంభకోణాలు బయట పెట్టింది తానే కాబట్టి తన పేరు చెబితే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అనేక ప్రజా సమస్యలు మీద అసెంబ్లీలో లేవనెత్తి గట్టిగా పోరాటం చేశానని నిజాయతీపరుడైన తనలాంటి ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా. నాకేమీ నష్టంలేదు. ప్రజలకే నష్టమని విష్ణుకుమార్‌ రాజు చెప్పుకొచ్చారు.