మేడా సస్పెన్షన్…వైసీపే గూటికి నేడే…!

Rajampet MLA Meda Mallikarjuna Reddy Suspended From TDP

ఎట్టకేలకు రాజంపేట పంచాయితీకి తెరపడింది. గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారు అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జున రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. అయితే వైసీపీలో చేరేపక్షంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ షరతు విధించినట్లు సమాచారం. ఇక మరోవైపు కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబు తన నివాసంలో సమావేశమయ్యారు. అనర్హుడికి అందలమెక్కించారని, మేడాను సస్పెండ్‌ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు సమావేశంలోనే ప్రకటించారు.

మేడా తీరుపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడా మల్లికార్జునరెడ్డిని సీఎంతో జరిగే సమావేశానికి రావాలని తానే స్వయంగా ఆహ్వానించానని సీఎం రమేశ్‌‌ తెలిపారు. తనతో వస్తానని చెప్పిన మేడా తర్వాత మాట మార్చారన్నారు. మేడా మల్లికార్జునరెడ్డి లేకపోయినా కడప జిల్లాలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేశారని సీఎం రమేశ్‌ తెలిపారు. మేడా మల్లికార్జున రెడ్డిని ప్రభుత్వ విప్‌, ఆయన తండ్రిని తితిదే సభ్యుడిగా నియమించి గౌరవించారన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీకి ద్రోహం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. పార్టీని వీడను అంటూనే ఇతర పార్టీలతో మేడా రాయబారాలు నడిపారని సీఎం రమేశ్‌ ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాజంపేట నేతలకు దిశానిర్దేశం చేస్తారని, దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌, శాసనసభ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.