తుపాకులు ప‌ట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే హంగామా: వీడియో

uttharakhand bjp mla

ఓ చేతిలో గ‌న్ ప‌ట్టుకొని.. మ‌రో చేతిలో మ‌ద్యం సీసాతో స్టెప్పులేసే స‌న్నివేశాల‌ను సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఓ ప్ర‌జాప్ర‌తినిధి అచ్చం అదే త‌ర‌హాలో బాలీవుడ్ పాట‌ల‌కు చేతిలో తుపాకులు ప‌ట్టుకొని అనుచ‌రుల‌తో డ్యాన్స్ చేస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో హ‌ల్‌చ‌ల్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఉత్త‌రాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రౌడీలా జ‌ల్సాలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తామ‌ని స్థానిక పోలీసులు తెలిపారు.

వివాదాస్ప‌ద ఉత్త‌రాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్ర‌ణ‌వ్ సింగ్ ఛాంపియ‌న్‌ను ఇప్ప‌టికే ఆ పార్టీ స‌స్పెండ్ చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌, అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా అత‌న్ని పార్టీ దూరం పెట్టింది. తాజాగా మ‌ద్యం సేవిస్తూ.. చేతిలో తుపాకులు ప‌ట్టుకొని ఐటెం సాంగ్‌కు మందుబాబుల‌తో చిందులేశాడు. ఈ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అధికార పార్టీపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇటీవ‌ల ఓ జ‌ర్న‌లిస్ట్‌ను ప్ర‌ణ‌వ్ బెదిరించ‌డంతో బీజేపీ అత‌న్ని పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.