ఎమ్మెల్యేలకి అర్ధమయ్యింది….మరి వీళ్ళకి ఎప్పుడో ?

‘‘ఎపీకి ఇచ్చిన మూడు హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ బీజేపీ ప్రజాదరణ పొందలేకపోయింది. విభజన నేపథ్యంలో ఏపీ పైన కేంద్రం వివక్ష చూపించిందని, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం అన్యాయం చేసింది, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని మోదీ చెప్పారని కానీ ఇవ్వలేదు, చంద్రబాబు, మోదీ మధ్య వైరం వల్ల బీజేపీ అంటే తెలుగు ప్రజలకు వ్యతిరేక పార్టీ అనే భావన ఏర్పడింది. చంద్రబాబు, మోదీ మధ్య వచ్చిన విబేధాల వల్ల విశాఖ రైల్వే జోన్, పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ రాలేదు”, ఇటీవల పార్టీని వీడే సమయంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇవీ. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి బాగోలేదు.. ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఏపీ హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు ఇక్కడి ప్రజలు కోపంతో ఉన్నారు’’ తాజాగా భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలివి. వీళ్లిద్దరే కాదు రాష్ట్రంలోని చాలా మంది బీజేపీ నేతల మనసులో ఉన్న అభిప్రాయం ఇది. కానీ, ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎవరూ గీత దాటడంలేదు. అందుకే తమ తప్పులున్నా కప్పిపుచ్చుకుంటూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ తప్పు చేసిందని చెబుతున్నా మరికొందరు సమర్ధించాల్సి వస్తోంది. దీంతో వారిపైనా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే మాణిక్యాలరావు తదితర నేతలు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.