బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రికే నమ్మకం లేదట…!

The Union Minister Does Not Believe That BJP Party Will Win

గత ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీయడంతో సునాయాస విజయాన్ని అందుకున్న భాజపా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మోడీ మేనియాతో సొంతంగా మెజారిటీని సంపాదించుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందో.. లేదోనన్న పరిస్థితికి దిగజారిపోయింది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఎన్డీయే సర్కారుపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదల వంటివి మోదీకి ప్రతిబంధకంగా మారాయి. దీనికి తోడు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీలోని సీనియర్లు వేరు కుంపటి ఏర్పాటు చేస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. సీనియర్లందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని మార్చాలనే ప్రతిపాదనను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

దానికి గడ్కరీ పేరు తెరమీదకి వచ్చింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఓ బీజేపీ నేత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీతో పాటు, జాతీయ రాజకీయాల్లో కలకలం రేపాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సీనియర్ నేత జయంత్ సిన్హా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తే అందరికీ పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది అస్థిర ప్రభుత్వమేనని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్న సమయంలో స్వయంగా కేంద్రమంత్రే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక టీవీ చానల్‌ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే దాఖలాలు లేవని, ఇది దేశ ప్రగతికి అంత మంచిది కాదని ఆయన అన్నారు. దీంతో సొంత పార్టీ వారికే బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం లేకపోబ్వదం చూస్తుంటే బీజీపే ఎటువంటి గడ్డు పరిస్థిది ఎదుర్కొననుందో అనేది అర్ధమవుతోంది.