Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమ కన్నా బరువైన స్కూల్ బ్యాగ్ లు మోసుకుని, ఆపసోపాలు పడుతూ స్కూల్ బస్సులు ఎక్కీ, దిగే చిన్నారుల్ని చూస్తే ఎవరికైనా జాలికలుగుతుంది. స్కూలుకు వెళ్లేటప్పుడు, స్కూలు నుంచి వచ్చేటప్పుడు ఆ బరువు మోయలేక చిన్నారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. అంత చిన్నవయస్సులోనే అన్నన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏమటిన్నది అందరికీ కలిగే సందేహమయినప్పటికీ…ఎవరి మటుకు వారు గుంపులో గోవిందలా తమ పిల్లల నెత్తిన పుస్తకాల బరువు పెట్టి వారిని బాల విద్యా కార్మికులుగా మారుస్తున్నారు. పిల్లలను ఇలా విద్యాకార్మికులునడానికి స్కూల్ బ్యాగులొక్కటే కారణం కాదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూళ్లలో పాఠాలు కుస్తీ పట్టీ పట్టీ మెదడూ, శరీరం అలసిపోయినప్పటికీ ఇంటికి వచ్చినా వారికి విశ్రాంతి లభించదు. హోం వర్క్ పేరుతో ఇంటిదగ్గరా వారికి చదువుల మోత తప్పదు. నిజానికి మనం గొప్పగా చెప్పుకునే విదేశాలలో చిన్నారులకు ఎలాంటి హోం వర్క్ ఉండదు. అన్నింటా పాశ్చాత్యులను అనుకరించే మనం… పిల్లల విద్య విషయంలో మాత్రం వారిని ఫాలో కాము. నిర్బంధ విద్యతో చిన్నారులకు బాల్యం అంటే చదువు తప్ప మరేమీ ఉండదన్న భావన కలిగిస్తున్నాం. ఈ తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
స్కూల్ బ్యాగుల బరువు, హోం వర్క్ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానంపై విలువైన సలహాలు ఇచ్చింది. విద్యార్థులు వెయిట్ లిఫ్టర్లు కాదని, స్కూల్ బ్యాగులు లోడ్ కంటెయినర్లు కావని జస్టిస్ కిరుబకరన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సూచించారు. స్కూల్ బ్యాగుల బరువుకు సంబంధించి పాలసీని వెంటనే రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించారు. బ్యాగ్ బరువు విద్యార్థి బరువులో పదిశాతం కంటే ఎక్కువ ఉండకూడదని రాష్ట్రప్రభుత్వాలకు సూచించారు.
అలాగే హోం వర్క్ పైనా జస్టిస్ కిరుబకరన్ కీలక ఆదేశాలిచ్చారు. సీబీఎస్ ఈ విద్యార్థులకు రెండో తరగతి వరకు హోం వర్క్ ఇవ్వొద్దని సూచించారు. నో హోం వర్క్ నిబంధనను పాఠశాలలు పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సీబీఎస్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటుచేయాలని కోరారు. ఈ విషయంపై నాలుగువారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈ, ఎన్ సీఈ ఆర్ టీలను ఆదేశించారు. ప్రభుత్వం సూచించని పుస్తకాల వాడకాన్ని నిలిపివేసేలా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించాలన్నారు.