ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీయాలని భావించిన బాలకృష్ణ – క్రిష్ మొదటి భాగంగా కథానాయకుడు ఈ సంక్రాంతికి విడుదల చేశారు. ఈరోజు ‘మహా నాయకుడు’ వంతు వచ్చింది. కథానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయాలకు తొలి భాగం పట్టం కడితే మహా నాయకుడిగా ఆయన సాగించిన జైత్ర యాత్రకు ‘మహానాయకుడు’ పట్టం కట్టింది. ఈ సెకండ్ పార్ట్‌లో కేవలం ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీని మాత్రమే ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జీవితం మొత్తం తెరిచిన పుస్తకంలానే సాగింది ఆయన చివరిరోజుల్లో పడిన మానసిక క్షోభకు రకరకాల కారణాలు సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ‘మొదటి సినిమా ఆడలేదంట.. ఆ తరువాత వచ్చిన సినిమా తిరుగులేదంట’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో డైలాగ్ ఇది. మరి ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం సరిగా ఆడలేదు మరి రెండో భాగానికి నిజంగానే తిరుగులేదా ? అనేది చూద్దాం.
కధ :
తోలి సినిమాలో మిస్ అయిన ఎన్టీఆర్ బాల్యం విద్యాభ్యాసం, వివాహం, సినీ ప్రస్థానం పొలిటికల్ ఎంట్రీ మొత్తాన్ని కేవలం 8 నిమిషాల టైటిల్ రన్ టైంలోనే చూపించి డైరెక్ట్‌గా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అసలు కథలోకి తీసుకువెళ్లారు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ కథానాయకుడు ఎండింగ్ పాయింట్ పార్టీ ప్రకటన తోనే మహానాయకుడు కథను మొదలౌతుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం.. అనూహ్యంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం.. ప్రజాకర్షణ పథకాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం.. తరువాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ బాగా నమ్మిన ఆయన పార్టీకే చెందిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌కు సీఎం కుర్చీని దూరం చేయడం, తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం క్యాన్సర్‌తో పోరాడుతూ ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్న బసవతారకం చివరి కోరికను నెరవేర్చుకోవడంతో ‘మహానాయకుడు’ కథ ముగుస్తుంది.
విశ్లేషణ :
ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? వాటిలో చంద్రబాబు పాత్ర ఎంత? బసవతారకం పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? తొలిభాగంలో కొరవడిన ఎమోషన్స్‌ని రెండో భాగంలో క్యారీ చేయడంలో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు అనేవే సినిమాలో ముఖ్య అంశాలు. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసిన ప్రేక్షకులకు ఏదో వెలితి ఏదో ఊహించుకుని వెళ్తే ఉన్నది కూడా సరిగా చూపించలేకపోయారే అని అయితే రెండో భాగంలో కాస్త ఉపశమనం అయితే లభించింది. సినిమాను సినిమాలాగ చూడాలన్న లాజికల్ పాయింట్ ఈ బయోపిక్ చిత్రాలకు వర్తించదు. ఎందుకంటే ఇది సినిమా కాదు. జరిగిన కథ. ఇలాంటి కథలు సినిమాలుగా వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసుకోవడం సర్వసాధారణం. యంగ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ ఏంటి ? అస్సలు మ్యాచ్ కాలేదనేది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసిన తరువాత చాలా మంది ప్రేక్షకులు భావన. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో వయసుకు తగ్గ పాత్రతో బాలయ్య బాగానే ఆకట్టుకున్నాడు. తెలుగు దేశం పార్టీ జెండాను రూపొందించినది మొదలు ఢిల్లీ స్థాయితో తెలుగోడి సత్తాని చాటి ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి చేజిక్కించుకునే సీన్ వరకూ ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి గట్టి ప్రయత్నమే చేశారు.
ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయలేకపోయినా పాత్రకు న్యాయం చేశారు. తొలిభాగంలో బాలయ్యలో ఎన్టీఆర్ కనిపించలేదు బాలయ్య మాత్రమే కనిపిస్తున్నాడంటూ వచ్చిన విమర్శలకు అడ్డుకట్ట వేయగలిగారు. కాషాయ వస్త్రాలు ధరించిన తరువాత నుండి పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ ఎమోషన్స్ పండించగలిగారు. ముఖ్యంగా అసెంబ్లీలో సొంత పార్టీకి చెందిన నాదెండ్ల అనుకూల వర్గం ఎన్టీఆర్‌ని నానా మాటలు అంటుంటే కోపాల్ని లోలోపలే ఉంచుకుని రగిలిపోయే సీన్లో బాలయ్య జీవిచారు. అయితే అయితే ‘మహానాయకుడు’ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి ఆయన బాల్యం నుండి మరణం వరకూ అన్నీ ఉంటాయని ప్రేక్షకులు భావించారు. దీనికితోడు ఆయన నాదెండ్లతో విభేదించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడంతోనే కథను ఆపేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం.. అల్లుడు చంద్రబాబు పార్టీలో కీలకంగా మారడం.. చివరి రోజుల్లో ఎన్టీఆర్ మానసిక క్షోభను అనుభవించడం లాంటి కీలక ఘట్టాలు వాస్తవంగా ఉన్నాయి. ఇందులో లక్ష్మీ పార్వతి అంశం కూడా కీలకమే. వీటిని ఏ మాత్రం టచ్ చేయకుండా కేవలం నాదెండ్ల, ఢిల్లీతో పొలిటికల్ వార్నే ‘మహానాయకుడు’గా చూపించారు క్రిష్. ఫ్యూచర్లో పాలిటిక్స్ డిమాండ్ చేస్తే.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలకు కొనసాగింపుగా పార్ట్ త్రీ తీసే ఉద్దేశం ఉందేమో చూడాలి. టెక్నికల్ పరంగా ఎన్బీకే బ్యానర్లో బాలయ్య నిర్మాణ విలువలు బాగున్నాయి. జ్ఞాన శిఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. బహిరంగ సభలు.. క్రౌడ్ షాట్స్ చాలా రిచ్‌గా చూపించారు.