యువతిని మోసం చేసిన యువకుడు

యువతిని మోసం చేసిన యువకుడు

ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు.

ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు.

విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయి తే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్‌ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్‌ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు.