రాహుల్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నిర్మలా

రాహుల్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నిర్మలా

బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ‘జీరో బడ్జెట్‌’ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ట్విటర్‌లో త్వరగా స్పందిస్తూ చేసిన రాహుల్‌ వ్యాఖ్యలను చూసి జాలి పడుతున్నానని అన్నారు. ముందుగా బడ్జెట్‌ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని సూచించారు. బడ్జెట్‌పై అవగాహన పెంచుకుని, బడ్జెట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు తాను రెడీ అని పేర్కొన్నారు.

అంతేగానీ సరైన హోంవర్క్ చేయకుండా విమర్శిస్తే తీసుకోనని అన్నారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన అంశాలను, ప్రయోజనాలను ముందుగా మహారాష్ట్ర, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని రాహుల్‌ గాంధీకి సవాల్ విసిరారు.ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే బడ్జెన్‌ను అర్థం చేసుకోడానికి తెలివి తేటలు ఉండాలని రాహుల్‌కు చురకలంటించారు. మ్యాథమెటిక్స్‌ అర్థం చేసుకోవడంలో రాహుల్‌కు సమస్య ఉందని అన్నారు. రాహుల్‌కు ప్రతీది సున్నాలాగే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అర్థం చేసుకున్న వారు బడ్జెన్‌ను స్వాగతించారని తెలిపారు. కాగా కేంద్రం జీరో బడ్జెట్‌ ప్రవేశపెట్టిదని రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు, యువతకు ఒరిగిందేమి లేదని దుయ్యబట్టారు.