ప్రియురాలిని నిప్పంటించిన ప్రియుడు

ప్రియురాలిని నిప్పంటించిన ప్రియుడు

ప్రియురాలు పెళ్లికి నో చెప్పడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని అదనుగా భావించి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కానీ, ఆమె ఊహించని షాకిచ్చింది. దీంతో అతడు మంటల్లో కాలి మృతి చెందాడు. ముంబైలోని గాంధీ నగర్‌లో శనివారం (ఫిబ్రవరి 6) ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ యువతి హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది.

ముంబైకి చెందిన విజయ్ కాంబే (30) తన వదిన చెల్లెలిపై మనసు పారేసుకున్నాడు. వరుస కుదరడంతో ప్రేమ పేరుతో ఆ అమ్మాయి (28) వెంట పడ్డాడు. ఆమె కూడా సరేనడంతో ఇద్దరూ కలిసి రెండున్నరేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువకుడికి మద్యం తాగే అలవాటుందని చెప్పడంతో అమ్మాయి కూడా తన మనసు మార్చుకుంది. అతడితో పెళ్లికి నో చెప్పింది.

ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పడంతో విజయ్ కాంబే ఆమెపై కోపం పెంచుకున్నాడు. కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. మానసికంగా వేధించడమే కాకుండా, ఆమెపై దాడి కూడా చేశాడు. అతడి వేధింపులు భరించలేక ఆ యువతి కొద్ది రోజుల కిందట ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. హాస్పిటల్‌లో వారం రోజుల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి తిరిగొచ్చింది.

బాధితురాలిని పరామర్శించే పేరుతో విజయ్ కాంబే ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే అదనుగా భావించి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి ఆమె ఒంటిపై పోసి నిప్పు పెట్టాడు. ఆమె మంటల్లో కాలి పోతుండగా గుమ్మం వద్ద నిల్చొని రాక్షసానందం పొందాడు. ఇదే సమయంలో ఆ యువతి తెగించింది. మంటల్లో కాలిపోతూనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తనతో పాటు తన ప్రియుడిని కూడా మంటల్లో కాల్చి బూడిద చేయాలనుకుంది.

గుమ్మం వద్ద నిల్చొని చూస్తున్న ప్రియుడి వద్దకు ఒక్క ఉదుటున దూకి, అతడిని బిగ్గరగా పట్టుకుంది. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలకు తాలలేక ఇద్దరూ అలాగే ఇంటి బయటకు వచ్చారు. ఆ దశలోనూ ఆమె పట్టు వీడలేదు. ఆమె నుంచి విడిపించుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆ మంటల్లో ఆమె కంటే అతడే ఎక్కువగా గాయపడ్డాడు.

యువతి, యువకులు మంటల్లో కాలిపోతుండటం గమనించిన స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ్ కాంబే మరణించాడు. బాధితురాలు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాలు దక్కవని తెలిసినా.. ఆమె మనసులో ఏ మూలనో ఆనందం ఉంది. తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వాడిని తన కంటే ముందే పైకి పంపించిన విజయగర్వమది..!