బన్నీ తీరుపై మెగా విమర్శలు

Mega Fans angry on Allu Arjun

అల్లు అర్జున్‌ ఈమద్య తరచుగా వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడినా కూడా కొందరు ఆయన మాటల్లో కొత్త అర్థాలను వెదికి మరీ వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపిస్తుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌ పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో చిత్ర నిర్మాత బన్నీ వాసు గురించి అల్లు అర్జున్‌ కాస్త ఎక్కువగా మాట్లాడాడు. సినీ ఇండస్ట్రీలో తాను ఇంతగా సక్సెస్‌ అవ్వడానికి ప్రధాన కారణం తన తండ్రి అల్లు అర్జున్‌ అయితే, ఆ తర్వాత స్థానం ఖచ్చితంగా వాసుదే అంటూ చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్‌ చేసిన వాసు తన సక్సెస్‌ రేటులో భాగస్వామి అంటూ ప్రకటించాడు.

సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచిన బన్నీ వాసును గుర్తు పెట్టుకున్న అల్లు అర్జున్‌, తనకు సినీరంగ ప్రవేశం కల్పించిన చిరంజీవిని మాత్రం మర్చి పోయాడు అంటూ అల్లు అర్జున్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన ఈ సక్సెస్‌కు, స్టార్‌డంకు అల్లు అరవింద్‌ మరియు బన్నీ వాసులు అంటూ చెప్పిన అల్లు అర్జున్‌ అసలైన చిరంజీవిని మర్చి పోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బన్నీ వాసుపై ప్రశంసలు కురిపించడంను ఎవరు తప్పుపట్టకున్నా చిరంజీవిని ఇక్కడ విష్మరించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. చిరంజీవి లేకుంటే బన్నీ అనేవాడు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యేవాడా అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ మరోసారి వివాదాస్పదం అయ్యాడు. మరి ఈ వివాదంపై అల్లు అర్జున్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.