తల్లికూతురి ఆత్మహత్య

తల్లికూతురి ఆత్మహత్య

బతుకుపోరులో అలసిన ఓ తల్లి కూతురితోపాటు తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా భైంసాలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని రాంనగర్‌లో నివాసముంటున్న భాగ్యశ్రీ (42)కి మహారాష్ట్ర ఉమ్రి తాలూకా బెల్దర్‌ గ్రామానికి చెందిన శివరాజ్‌ హన్‌శెట్టితో వివాహమైంది. వీరికి కూతురు సిన్ని (21) ఉంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న భాగ్యశ్రీ ఇంట్లోనే బ్యూటీపార్లర్‌ నడుపుతూ కూతురిని చదివిస్తోంది.

గతేడాది కూతురికి మెడిసిన్‌లో ర్యాంకు రావడంతో, సంగారెడ్డిలోని మెడికల్‌ కాలేజీలో చేర్పించింది. ఈ క్రమంలో డబ్బు అవసరమై అప్పు చేయగా, వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నానని పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడేది. ఆదివారం రాత్రి తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన భాగ్యశ్రీ, సోమవారం ఉదయం కూతురితో కలసి క్రిమిసంహారక మందు తాగి, ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.