కారు యాక్సిడెంట్‌లో నానికి స్వల్పగాయలు…

Nani Responds About the Car Accident

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకు పోతున్న నాని సెలవు లేకుండా షూటింగ్‌లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా పాల్గొంటూ ఉన్నాడు. తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కృష్ణార్జున యుద్దం’ షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ రాత్రి సమయంలో జరుపుతున్నారు. తాజాగా రాత్రి షూటింగ్‌ ముగించుకుని తెల్లవారు జామున నాని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైంది. నాని కారు డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక విచారణలో తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో జరిగిన ఈ ప్రమాదం గురించి కారు డ్రైవర్‌ రకరకాలుగా చెప్పడంతో కాస్త గందరగోళం ఏర్పడటం జరిగింది.

యాక్సిడెంట్‌ అయిన వెంటనే నాని మరో వాహనంలో ఇంటికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న నాని డ్రైవర్‌ మొదట యాక్సిడెంట్‌ అయినప్పుడు తాను మాత్రమే కారులో ఉన్నాను అంటూ చెప్పాడు, ఆ తర్వాత నాని తండ్రి కూడా కారులో ఉన్నాడు అంటూ ఆ తర్వాత చెప్పుకొచ్చాడు. పోలీసులు నాని తండ్రితో మాట్లాడిన సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది. నాని కారులో ఉన్నాడని, స్వల్ప ప్రమాదం అంటూ ఆయన పోలీసులకు చెప్పాడు. నాని కూడా తర్వాత ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ చిన్న యాక్సిడెంట్‌, చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అంతా బాగానే ఉంది, వారంలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

డ్రైవర్‌ ఎందుకు అబద్దాలు చెప్పాడు అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. యాక్సిడెంట్‌ విషయం బయటకు వస్తే నాని అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆందోళన చెందుతారనే ఉద్దేశ్యంతో తాను మొదట అబద్దం చెప్పాను అని డ్రైవర్‌ చెప్పుకొచ్చాడు. నాని స్వయంగా డ్రైవర్‌తో అబద్దం చెప్పించి ఉంటాడు అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను పోలీసులు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు రావడం, నాని స్వయంగా ట్వీట్‌ చేయడం జరిగిపోయింది.

Nani tweets on car accident