National Politics: హిమాచల్​ ప్రదేశ్‌లో భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు

National Politics: Earthquake in Himachal Pradesh.. People panicked
National Politics: Earthquake in Himachal Pradesh.. People panicked

హిమాచల్​ ప్రదేశ్‌లోని చంబా జిల్లా పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3గా తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. చంబా పట్టణంతో పాటు అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలీలోనూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. గురువారం రాత్రి 9 గంటల 34 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు రాజధాని శిమ్లాలోని జాతీయ భూకంప అధ్యయన విభాగం NCS​ ప్రకటన జారీ చేసింది.

భూకంపం కారణంగా పాంగి సమీపంలోని గ్రామాల్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రభావితమైందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతానికి బృందాలను పంపించామని వెల్లడించారు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నందున, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదికలు అందాల్సి ఉందని పేర్కొన్నారు.

హిమాచల్​ప్రదేశ్​ భూకంపం ప్రభావంతో పంజాబ్‌, హరియాణాల్లోని పలు ప్రాంతాలతో పాటు ఛండీగఢ్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూమి కంపించడంతో పలుచోట్ల జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.