ఐటీ ఉద్యోగులపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ?

ఐటీ ఉద్యోగులపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ?

బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ మహిలకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా హైదరాబాద్‌, తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. మాస్కులు తప్పనిసరి చేసింది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా నగరంలో ఉన్న ఐటీ కంపెనీలు కూడా పని విధానంలో మార్పులు చేర్పులకు ముందుకు వచ్చాయి.

నగరంలో స్టార్టప్‌ల మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీల వరకు వేల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అయితే గతేడాది కరోనా సంక్షోభం మొదలవడంతో ఐటీ కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు తాళాలు వేశాయి. చిన్నా పెద్దా అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానంలోకి వెళ్లి పోయాయి.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా ఆఫీసులు తిరిగి తెరుచుకున్నాయి. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైస్‌ అసోసియేషన్‌ (హైసా) చెబుతున్న వివరాల ప్రకారం టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ మల్టీ నేషనల్‌, పెద్ద కంపెనీల్లో కేవలం 5 శాతం ఉద్యోగులే ఆఫీస్‌ వర్క్‌ విధానం వైపు మళ్లగా 30 శాతం మంది హైబ్రిడ్‌ మోడ్‌లో పని చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 30 నుంచి 70 శాతం ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్థి పలికి తిరిగి ఆఫీసులకు వెళ్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని కంపెనీలు పూర్తిగా ఆఫీస్‌ వర్క్‌ లేదా హైబ్రిడ్‌ వర్క్‌ విధానంలోకి మళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ భయాలు కొనసాగుతుండగా ఇండియా ఐటీ హెడ్‌ క్వార్టర్‌ బెంగళూరులో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసింది. ఇదే సమయంలో అట్‌ రిస్క్‌ దేశం నుంచి వచ్చిన మహిళ కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అది ఒమిక్రాన్‌ వేరియంటా? కాదా అనేది ఇంకా తేలలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చిన్న నుంచి పెద్ద కంపెనీల వరకు ఆఫీస్‌ వర్క్‌ విధానం అమలుపై వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించాయి. మరికొంత కాలం వర్క్‌ఫ్రం హోంలో ఉన్న వారిని ఆఫీసుకు రమ్మనే విషయంలో వెనుకడుగు వేస్తున్నాయి.

ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. నగరంలో ఉన్న 6.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయిస్‌లో 90 శాతం మంది ఒక డోసు టీకా తీసున్నారు.కనీసం 60 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. దీంతో కోవిడ్‌ భయం కొంత మేరకు తగ్గినా ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందనే దానిపై అంచనా లేదు. దీంతో వర్క్‌ ఫ్రం హోం విధానం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.