పూల కోసం వెళ్తే పులి ఎదురైంది

పూల కోసం వెళ్తే పులి ఎదురైంది

మనం అడవిలో వెళ్తున్నప్పుడు ఎదురుగా పులి ఎదురైతే పరిస్థితి ఎలాగుంటుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. బెజ్జూర్ మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన దందేరా పెంటయ్య అనే వ్యక్తి బుధవారం బతుకమ్మ పూల కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లగా పెద్ద పులి కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన పెంటయ్య దాని కంటపడకుండా గ్రామానికి పరుగుతీశాడు. పులి కనిపించిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

దీంతో గ్రామ సర్పంచ్‌ బుజడి శేఖర్‌తో కలిసి అనేకమంది గుంపుగా పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే పులి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే అక్కడ పులి పాదముద్రలు కనిపించడంతో పెంటయ్య చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి పులి నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.