మూడు దశాబ్దల నుంచి వందల కొద్ది దొంగతనాలు

మూడు దశాబ్దల నుంచి వందల కొద్ది దొంగతనాలు

మూడు దశాబ్దల నుంచి వందల కొద్ది దొంగతనాలు చేశాడు.. దోపిడీ చేసిన సొమ్ముతో.. విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడ్డ ఓ దొంగను ఒడిశా పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. క్రౌబర్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన సదరు వ్యక్తి 35 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ.. సుమారు ఐదు కోట్ల రూపాయల సొమ్ము దోపిడీ చేశాడు. పోలీసులకు చిక్కడం.. జైలుకు వెళ్లడం.. విడుదలయ్యాక మళ్లి దొంగతనాలు చేయడం అతడికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి అరెస్ట్‌ అయ్యాడు.ఒడిశాకు చెందిన హేమంత్‌ దాస్‌ ‘క్రౌబర్‌ మ్యాన్‌’గా ప్రసిద్ధి చెందాడు.

అతడు 1986 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 500 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తం 4-5 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. దోపిడీ చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు.హేమంత్‌ దాస్‌ భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో చదువుతుండగా.. మొదటి సారి 1980లో ఓ వివాదంలో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లాడు. అక్కడ అతడికి ఓ దొంగతో పరిచయం ఏర్పడింది. అతడి వద్ద నుంచి దొంగతనాలకు సంబంధించి మెలకువలు నేర్చుకున్నాడు హేమంత్‌ దాస్‌.1986 నుంచి, హేమంత్ ఒక ప్రొఫెషనల్ దొంగగా మారాడు.

అతను ఒడిశాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక్క భువనేశ్వర్‌లో మాత్రమే 100పైగా దొంగతనాలు చేశాడు. మొత్తం 500కి పైగా కేసులలో అతని ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కటక్‌లో చోరీకి పాల్పడుతుండగా హేమంత్‌ దాస్‌ని అరెస్టు చేశారు. అంతకుముందు, 2018 లో భువనేశ్వర్‌లో స్పెషల్ స్క్వాడ్ అతనిని అరెస్టు చేసింది. పోలీసుల ప్రకారం, 2020లో పూరీలో జరిగిన రెండు దొంగతనాల కేసులకు సంబంధించి మరోసారి అరెస్టయ్యాడు. ఈ సంవత్సరం జూలైలో విడుదలయ్యాడు. తాజాగా మరోసారి అరెస్ట్‌ అయ్యాడు

ఈ సందర్భంగా భువనేశ్వర్ డీసీపీ మాట్లాడుతూ, “హేమంత్ ఎక్కువగా నగదును దొంగిలించేవాడు. గ్యాంగ్‌టక్, సిమ్లా, జమ్మూ కశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎంజాయ్‌ చేయడానికి వెళ్లేవాడు. ప్రజల ఇళ్లలోకి చొరబడేందుకు అతను సాధారణ సాధనాన్ని ఉపయోగించినందున అతడిని ‘క్రౌబర్ మ్యాన్’ అని పిలుస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన మరికొన్ని చోరీ కేసుల్లో హేమంత్‌ ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.