విద్యార్ధిగా ఉన్నప్పుడే రాజాకీయాలు….జైట్లీ ప్రస్థానం 

Politics while a student .... Jaitley reigns
కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆయన మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జైట్లీ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 8న ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబ సభ్యులు.
అప్పటి నుంచి ఎయిమ్స్‌ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు.
ఆయనకు లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచారు. ఇవేవి ఆయన్ను బతికించలేకపోయాయి. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఇటీవల అమెరికాకు వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు జైట్లీ. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చికిత్స కొనసాగించారు.
అయితే ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. 1952 నవంబర్ 28న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన అరుణ్ జైట్లీ తండ్రి పేరు మహారాజ్ కిషన్ జైట్లీ. ఆయన ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ, లా చదివారు.
ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ అంటే ఇప్పటి బీజేపీలో చేరారు.  ప్రధానమంత్రి  విశ్వనాథ్ ప్రతాప్ సింగ్  హయాంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు.
1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభలో సభ్యుడుగా కూడా ఉన్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకోలేదు జైట్లీ.