ప్రకాశమా వికాసమెక్కడ అని ప్రశ్నించిన పువ్వాడ వెంకటేష్

ప్రకాశమా వికాసమెక్కడ అని ప్రశ్నించిన పువ్వాడ వెంకటేష్

ప్రకాశం జిల్లా ఆవిర్భవించి అయిదు దశాబ్దాలు కావస్తుంది. అయితే ఈ జిల్లా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే , ఈ అర్థ శతాబ్ధపు నిర్లక్ష్యానికి నిలువుటద్దం ప్రకాశం జిల్లా అని చెప్పడం అతిశయోక్తి కాదు. 1970 వ సంవత్సరంలో కర్నూలు నుంచి మార్కాపురం డివిజన్, గుంటూరు నుంచి ఒంగోల్ డివిజన్, నెల్లూరు నుంచి కందుకూర్ డివిజన్లని కలిపి ఒంగోలు కేంద్రంగా జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత 1972 మే 2న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులి గారి పేరు పెట్టారు. జిల్లా విస్తీర్ణం 17141 చ.కి.మీ. కోస్తా జిల్లాలన్నిటిలోకి పెద్ద జిల్లాగా వుంది .

తీవ్ర వర్షా భావం – వరుస కరువులు ,తత్ఫలితంగా కుదేలవుతున్న వ్యవసాయం.

పూర్తిగా వ్యవసాయాదారితమైన జిల్లా ప్రకాశం జిల్లా. కానీ ఇక్కడ యాభై శాతం దాక తక్కువ వర్షపాతం లోటు వుంది. యాడాది సాదారణ వర్షపాతం 751 సెంటీ మీటర్లు. ఈ వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రజలు ఎక్కువగా మెట్టపంటలను పండిస్తారు. కానీ గిట్టు బాటు దర లేక వ్యవసాయం ఏటా కుంటుపడుతుంది. మొత్తం రాష్ట్రంలో సగంకి పైగా పొగాకు ఈ జిల్లా నుంచే వస్తుంది. అయితే వరుస కరువులతో నానాటికి పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఎండిన బావులు, చెరువులు, అడుగంటిన భూగర్భ జలాలు దాంతో వేసవి వస్తే కొన్ని ప్రాంతాలు ఎడార్ని తలపించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సాగు నీరే కాదు తాగు నీరుది అదే సమస్య. వేసవిలో జిల్లా కేంద్రమైన ఒంగోలు లోనే వారానికి ఒక్కసారి నీటిని పట్టి నిల్వ చేసుకుంటారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకొవాలి. సాగర్ నుంచి రావల్సిన నీటిని ఎగువ ప్రాతాలు ఆవిరి చేస్తుంటే అడిగే నాదుడు లేడు. 4లక్షల 42వేల ఎకరాలకి పైగా సాగు నీరు, 15 లక్షల మందికి పైగా తాగు నీరు లక్ష్యంతో మొదలైన వెలిగొండ ప్రాజెక్టు దశాబ్ధం కాలం దాటుతుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుంది. దీనిపై మాట్లాడేందుకు ఒక్క రాజకీయ గొంతు లేకపొవడం చాలా బాధాకరం . మన్నేరు, పాలేరు, ముసి, నదుల నడుమ ప్రతి నాలుగు కిలోమీటర్లకి ఒక చెక్ డ్యాం కడితే ప్రస్థుతానికి కొంత పరిస్థితి మెరుగు పడుతుందని నిపుణులు చెప్తున్నారు , కానీ ఆ దిశగా మన పాలకులు ఒక్క అడుగు కూడా ముందుకెయ్యడం లేదు. ప్రతి వంద ఎకరాలకి గాను ఇరవై మూడు ఎకరాలకే సాగు నీరందుతుంది, అది కూడా అంతంతమాత్రమే. గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులో మెరుగవ్వాల్సిన పనులు చాలా వున్నాయి. నేటికీ సాగర్ జలాల్లో వాటాని ఆశించిన స్థాయిలో సాదించుకోలేకపోయామనేది కాదనలేని వాస్తవం. ఈ నీటి ఎద్దడిని అదిగమించే మార్గాలున్నా గానీ ఆ దిశగా మన పాలక యంత్రాంగం అడుగులు వేయడం లేదనేది కొంతమంది వాదన.

ఫ్లోరైడ్ రక్కసి

జిల్లాలో వెయ్యికి పైగా గ్రామ పంచాయితీలుంటే అందులో ఏడు వందలకి పైగా పంచాయితీలు ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కుంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. దీని కారణంగా దంతాలకి గార రావడం, చిన్న వయసులోనే వౄద్దాప్య చాయలు కనిపించడం, కిడ్నీ సంబందిత వ్యాదుల భారినపడుతున్నారు. ఎంతో భాద్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాసుపత్రులు కుడా ఇలాంటి కేసులకి సంభందించి వైద్యం కోసం ప్రైవేటు ఆసులత్రులకు సిఫారసు చేయడం చాలా భాదాకరమైన విషయం. దాంతో సరైన వైద్యం అందక రెక్కాడితే గానీ డొక్కాడని కొన్ని మద్యతరగతి కుటుంబాలు ఆర్ధిక భారంతో చితికి పోతున్నాయి. కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సమస్య అదికంగా వుంది. ఇక్కడ ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేసినా గానీ సరైన పర్యవేక్షణ లేదనేది స్థానికుల దగ్గర్నుంచి వస్తున్న విమర్శ. అయితే ఈ ఫ్లోరోసిస్ ని ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం, అది తాగునీటితోనే సాద్యమని స్థానికులు చెప్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు త్వరతగతిన పూర్తయితే ఈ సమస్యను చాలా వరకు అదిగమించవచ్చని ఇక్కడ నాయకుల అభిప్రాయం.

మాటల్లోనే గానీ చేతల్లో కనిపించని పారిశ్రామిక అభివౄద్ది !

ముప్పై లక్షలకి పైగా జనభా వున్న జిల్లాలో ఎనిమిది లక్షలకి పైగా ప్రజలు వలసలు వెల్లి బ్రతుకులు వెల్లదీస్తున్నారంటే, ఇక్కడ ఉపాది అవకాసాలు ఏ స్థాయిలో వున్నాయనేది అర్థమవుతుంది. దొనకొండకి వస్తుందనుకున్న హెలికాఫ్టర్ విడిబాగాల తయారీ సంస్థ వెనక్కి పోవడానికి కారణం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇండోనేసియాకి చెందిన ఏసియా పల్ప్ అండ్ పేపర్ సంస్థ, జిల్లాలోని గుడ్లూరు మండలం రావూరి దగ్గర 24 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రభుత్వం మారాకా ఆ ఒప్పందాలన్నీ ఇప్పుడు బుట్టదాకలయ్యాయి. కనిగిరి ,పామూరు మద్యలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి NIMZ(National investment and manufacturing zone) ప్రణాలికలు సిద్దం చేసింది కానీ వాటిని ఆచరణ దిశగా నడిపించే సామర్ద్యం గల నాయకత్వం లేకపోవడం జిల్లా దురదౄష్టం. ఉపయోగకరమైన పరిశ్రమలు, వాటి ద్వారా కలిగే ఉద్యోగ ఉపాది లేక ఎంతోమంది చెన్నై , బెంగలూర్, హైదరాబాద్ వంటి నగరాలకి వలసలు వెళ్లి బ్రతుకులీడుస్తున్న కుటుంబాలు అనేకం. విభజనాంధ్రప్రదేశ్ లో రాజదాని ఎక్కడా అంటే మొదటగా వినిపించిన పేరు దొనకొండ. దానికి ప్రదాన కారణం ఇక్కడ వున్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములైనప్పటికీ, రాజదాని కోసం వేసిన శ్రీక్రిష్ణ కమిటీ కూడా దొనకొండని ఒక ఆప్షన్ గా సూచించడం గమనార్హం. కానీ మన నాయకులాడిన రాజకీయ చదరంగంలో ప్రకాశం జిల్లా ఒక పావుగా మిగిలిపోయింది. రాజదాని అమరావతి కాస్తో కూస్తో దగ్గరగా వుంది కదా, భవిష్యత్తులోనైనా దాని అభివౄద్ది ఫలాలు జిల్లాకి అందుతాయని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు అమరావతి కూడా ప్రశ్నగా మిగిలిపోవడం ప్రకాశం జిల్లాకి మింగుడుపడని అంశం.

తీర ప్రాంతం

102 కిలోమీటర్ల తీరప్రాంతం కలిగి వుండడం ప్రకాశం జిల్లాకి సానుకూలాంశం. అయితే అన్నీ కలిసొచ్చి రామాయపట్నం పోర్ట్ కల సాకారమైతే, ఇక్కడ ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లో ఉద్యోగ ఉపాది అవకాశాలు వస్తాయి . దానికోసం పార్టీలకతీతంగా నాయకులంతా కలిసి పోరాడాల్సిన అవసరం చాలావుంది.

ట్రిపుల్ ఐటి

ఈ మద్య కాలంలో హర్షించదగ్గ విషయమేమిటంటే, జిల్లా కలెక్టర్ పోలా బాస్కర్ గారి ప్రత్యేక చొరవతో, ట్రిపుల్ ఐటి ని సాదించుకోగలిగారు. అక్ష్రాస్యతలో 35.35 శాతం వ్రుద్ది రేటు వుంది. ఇన్నేల్లయినా ఒక్క యూనివర్సిటీ కూడా జిల్లాలో లేదంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ప్రపంచ గుర్తింపు గల గెలాక్సీ గ్రానైట్ వుండే చీమకూర్తి ప్రాంతానికి మైన్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివౄద్ది చేస్తామన్నారు. కానీ అది మాటలకే పరిమితమైపోయింది.

ఒంగోలు గిత్త

రాజసానికి, దర్పానికి మారుపేరు ఒంగోలు జాతి గిత్తలు. స్వదేశంలోనే కాదు విదేశీయులని కూడా వాటి పనితనంతో కట్టిపడేసాయి. ఒక్క బ్రెజిల్ దేశంలోనే 20 లక్షలకి పైగా ఈ జాతి గిత్తలున్నాయంటే వాటి ప్రాముఖ్యతని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆస్ట్రేలియా ,మలేసియా,ఇండోనేసియా వంటి దేశాల్లో కూడా రంకేసి తెలుగు జాతి శక్తిని ప్రపంచానికి చాటింది. హాలాండ్ దేశం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో పోతు రాముడు పేరుతో మన గిత్త విగ్రహం ఏర్పాటు చేశారు. అదీ మన ఒంగోలు గిత్త గొప్పదనం. అయితే కాల క్రమమంగా వ్యవసాయ విదానాలలో మార్పుల వలన వీటి అవసరం తగ్గిపోతుంది. అయితే మన తెలుగు జాతికి గర్వకారణమైన ఈ గిత్తల మనుగడను కాపాడుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉంది. దీనిలో బాగంగానే ఒంగోలు పశు ఉత్పత్తిదారుల సంగం ఆద్వర్యంలో గుంటూరు లాం ఫారం లో వీటి అభివౄద్దికి పరిశోదనలు జరుగుతున్నాయి.

అయితే ప్రకాశం జిల్లా ప్రస్తావన వచ్చినప్పుడు ఒంగోలు గిత్త గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. కానీ ఆఖర్లో ప్రస్తావించడానికి కారణం, నేడు జిల్లాలో పశువులు మేయడానికి కూడా పశుగ్రాశం పండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు జిల్లా కీర్తికి ప్రతిరూపమైన గిత్తలని ఎలా కాపాడుకోగలం అనే ప్రశ్న మొదలవుతుంది తద్వార తడి లేని పంటభూముల గోడు మన పాలకులకి వినపడుతుందనే ఆలోచనతో ఇప్పుడు ప్రస్థావించాను.

ఏక స్వరం కావాలి

తరాలు మారాయి, రాజకీయ స్వరాలు మారాయి. కానీ జిల్లా భాగ్యరేఖల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రజల్ని కలుపుకొని నాయకులంతా ఏకమై ఏక స్వరంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినబడేలా అభివౄద్ది నినాదంతో గొంతెత్తాల్సిన చారిత్రక అవసరముందని అందరి ఆకాంక్ష.