ప్రేమించిన యువతిని గొంతు నులిమి చంపేశాడో ప్రేమికుడు

ప్రేమించిన యువతిని గొంతు నులిమి చంపేశాడో ప్రేమికుడు

ప్రేమించిన యువతిని గొంతు నులిమి చంపేశాడో ప్రేమికుడు. ఈ సంఘటన నవరంగపూర్‌ జిల్లాలోని తెంతులికుంటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వారిద్దరూ ఏ కారణం రీత్యా తగాదా పడ్డారో కానీ ఈ దుస్థితి ఎదురైందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనపై మృతురాలి తల్లి సూర్యగోండ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారు.

అంచలగుమ్మ గ్రామానికి చెందిన భీష్మ హరిజన్, అదే గ్రామానికి చెందిన +3 విద్యార్థి ధరణి ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఊరిలోనే పనులకు వెళ్తూ.. కుంటుంబానికి అండగా నిలుస్తున్న ధరణి ఎప్పటిలాగే పనికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా భీష్మ హరిజన్‌ నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మాట్లాడాలని పాఠశాల వద్దకు రావాల్సిందిగా ధరణిని భీష్మ కోరాడు. అయితే పనికి వెళ్లిన యువతి ఇంటికి ఎంతసేపటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు యువతి ఆచూకీ కోసం గాలించారు.

ఆఖరికి ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు విషయం బాధిత కుటుంబానికి తెలియజేశారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న వారు యువతి గొంతుపై చేతి గోళ్ల గాట్లు ఉండటం చూసి, ఈమెను ఎవరో హత్య చేసేందుకు ప్రయత్నించి ఉంటారని భావించారు. అనంతరం అంబులెన్స్‌లో తెంతులికుంటి ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. అయితే అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆ యువతి చనిపోవడం విచారకరం. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం యువతి మృతదేహాన్ని బాధిత కుటుం బసభ్యులకు అందజేశారు.