సెలవు రోజుల్లో కూడా శాలరీస్‌ చెల్లింపులు

ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట​​‍్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్‌ హాలిడేస్‌లో కూడా బల్క్‌ పేమెంట్‌ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌  పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్‌, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి.

వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్‌ స్టెప్‌ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్‌ బ్యాంక్‌ సర్వీసెస్‌ అందిస్తే రూ. 20 ప్లస్‌ జీఎస్‌టీని వసూలు చేయనుంది. పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్‌ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు.