ప్రమాదవశాత్తు లోయలో పడిన బస్సు

ప్రమాదవశాత్తు లోయలో పడిన బస్సు

ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిన ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత అధికంగానే ఉన్నా అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ సహా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలానికి ఘాట్ రోడ్డులో పల్లెవెలుగు బస్సు వస్తున్న క్రమంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వెంటనే క్షతగాత్రులకు సహాయం చేశారు. 108కి ఫోన్ చేసి వారిని ఆళ్లగడ్డ పంపించారు.

బస్సులో ప్రయాణికులు అధికంగా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఊహకందని ప్రాణనష్టం జరిగేది. ప్రమాదంలో పల్లెవెలుగు బస్సు బాగా దెబ్బతింది. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఆలయ అధికారి నర్సయ్య ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అలాగే, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల నాని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.