Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూయార్క్ ఉగ్రదాడి నిందితుడు సైఫుల్లా సైపోవ్ ఈ దారుణానికి ఒడిగట్టడంపై ఏ మాత్రం పశ్చాత్తాపం చెందడం లేదు సరికదా…చాలా ఆనంద పడుతున్నాడు. పోలీసుల విచారణలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో సైఫుల్లా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద తన ట్రక్కుతో సైక్లిస్టులు, పాదాచారుల మీదకు నిర్దాక్షిణ్యంగా దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సైఫుల్లాపై కాల్పలు జరిపి ఘటనాస్థలిలోనే అదుపులోకి తీసుకోవడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. సైఫుల్లాకు ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో సైఫుల్లా దాడికి గల కారణాలతో పాటు అనేక విషయాలు వెల్లడించాడు. ఉగ్రవాదసంస్థ ఐసిస్ వీడియోలు చూసి తాను ప్రేరణ పొంది ఈ దాడికి పాల్పడ్డానని సైఫుల్లా చెప్పాడు. ఏడాది నుంచి ఈ దాడికోసం ప్రణాళిక రచించానని, అక్టోబరు 22న ఓసారి ట్రయల్ వేశానని తెలిపాడు. ట్రక్కును ఎలా నడపాలో, ఎలా వేగంగా దూసుకెళ్లాలో ట్రయల్ వేసి చూసుకున్నానని చెప్పాడు.
దాడిచేసినందుకు తాను కొంచెం కూడా బాధపడడం లేదని, చేసిన పనికి చాలా ఆనందంగా ఉందని కూడా సైఫుల్లా వెల్లడించాడు. బ్రూక్లీన్ బ్రిడ్జిపై దాడిచేద్దామని తొలుత అనుకున్నా… చివరి నిమిషంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఎంచుకున్నానని తెలిపాడు. హాలోవిన్ సమయంలో వీధుల్లో ఎక్కువమంది ఉంటారని, అందుకే దాడిచేశానని సైఫుల్లా చెప్పాడు. అతన్ని న్యూయార్క్ పోలీసులు నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికా చట్టాల ప్రకారం సైఫుల్లాకు మరణశిక్ష వేసే అవకాశముందని అటార్నీ జాన్ కిమ్ చెప్పారు. అటు సైఫుల్లాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సభ్యసమాజంలో నివసించేందుకు ఉగ్రవాది తగిన వ్యక్తి కాదని, అతన్ని క్యూబాలో ఉన్న గ్వాంటనామా బే జైలుకు తరలిస్తామని, అతను జీవితాంతం అక్కడే ఉంటాడని హెచ్చరించారు. ఏ దేశస్థులకు పడితే..ఆ దేశస్థులకు అమెరికాకు రావడానికి అనుమతులు, వీసాలు ఇస్తుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని, తన వలస విధానమే మంచిదని ట్రంప్ విశ్లేషించారు. ఇకపై వీసా విధానాన్ని మరింత కఠినతరం చేస్తామని, అమెరికాను సురక్షితంగా ఉంచడమే తన లక్ష్యమని అధ్యక్షుడు స్పష్టంచేశారు. వైవిధ్య వీసా పథకాన్ని రద్దు చేసే ప్రక్రియను తక్షణం ప్రారంభించేందుకు సహకరించాలని కాంగ్రెస్ ను కోరుతామని తెలిపారు. వినడానికి చాలా బాగా అనిపించే ఈ పథకం ఇతర దేశాలను ఆకర్షిస్తుందని, వాస్తవానికి దీని వల్ల అమెరికాకు నష్టం వాటిల్లుతోందని, అమెరికా అభివృద్ధికి మేలు చేకూర్చేలా..ప్రతిభ ఆధారిత వలస విధానం రావాలన్నదే తన అభిమతమని ట్రంప్ స్పష్టంచేశారు.