టీడీపీ-కాంగ్రెస్ పొత్తు…క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ దూత…!

Sensational Statement On TDP Congress Alliance

తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్ పొత్తు వ్యవహారం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు కలిశాయి. అప్పటి నుంచి ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ సంచలనం అయింది. చాల సార్లు ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నిజానికి టీడీపీ-కాంగ్రెస్ స్నేహ బంధంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా ఈ పార్టీలు మరో రెండు పార్టీలతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కూటమి ఓటమి పాలైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి, కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించాయి. ఈ ఫలితాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ పైనా పడింది. దీనికి కారణం కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏపీలోనూ పోటీలో ఉండడమే. దీనికితోడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడమూ ఏపీ ఎన్నికలపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

దీని పై బాబు స్పష్టత ఇచ్చినప్పటికీ, తాజాగా పూర్తి క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు కోసం పాకులాడితే ఏపీలో మాత్రం టీడీపీ పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడుతోంది. ఆ పార్టీలోని చాలా మంది సీనియర్లు సైకిల్ పార్టీతో పొత్తును కోరుకుంటున్నారు. అందుకే ఇటీవల జరిగిన చంద్రబాబు రాహుల్ గాంధీ భేటీ కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఆ భేటీలో ఏపీలో పొత్తులపై వీళ్లిద్దరి మధ్యా ఎటువంటి చర్చ జరగలేదు. దీంతో ఇక, ఏపీలో పొత్తు లేనట్లేనని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే, తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పళ్లంరాజు టీడీపీతో కాంగ్రెస్‌కి పొత్తులేదని తేల్చేశారు. రాహుల్‌ గాంధీతో ఉన్న క్లారిటీ మేరకే ఆయన రాష్ట్రంలో టీడీపీతో పొత్తులేదన్న అంశంలో పళ్లంరాజు స్పష్టత ఇచ్చి ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే కాకినాడ లోక్‌సభ నుంచి పళ్లంరాజు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారని ఇన్నాళ్లూ ఊహాగానాలు సాగాయి. పొత్తులేదని ఆయనే స్వయంగా తేల్చేయడంతో ఇక అన్ని స్థానాలలోనూ టీడీపీ విడిగా పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. అయితే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన కాంగ్రెస్ అక్కడ ఒక్క స్థానం గెలిచినా అదొక అధ్బుతమే మరి.