శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో మర్చిపోలేని రోజు

శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో మర్చిపోలేని రోజు

26 నవంబర్ 2021, టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌లో మర్చిపోలేని రోజు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత తరపున అరంగేట్ర టెస్టులో అయ్యర్ సెంచరీని సాధించాడు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ముంబై నుంచి ఈ ఫీట్‌ సాధించిన మూడో ఆటగాడిగా శ్రేయస్‌ నిలిచాడు.

అంతకు ముందు రోహిత్ శర్మ,పృథ్వీ షా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించారు. ఇక తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన హిట్‌మ్యాన్‌.. తాను, అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోకు అద్బుతంగా ఆడావు.. అంతా బాగా జరుగుతుంది అంటూ రోహిత్‌ క్యాప్షన్‌ పెట్టాడు. కాగా ఈ వీడియోలో శ్రేయస్‌ ముందుండి డ్యాన్స్‌ చేయగా, రోహిత్‌, శార్దూల్‌ అతడిని అనుకరిస్తూ స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌అవుతోంది.