కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన మద్యం మత్తు

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన మద్యం మత్తు

మద్యం మత్తు.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చివరికి హత్యకు ఉసిగొల్పింది.. ఫుల్‌గా తాగిన వ్యక్తి తన అత్తనే హత్య చేసిన ఉదంతం రౌతులపూడి మండలం బలరామపురంలో కలకలం రేపింది.. మృతురాలి కుటుంబ సభ్యులు, తుని రూరల్‌ సీఐ కె.కిశోర్‌బాబు, కోటనందూరు ఎస్సై ఎం.అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బలరామపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో సోమరౌతు నూకరత్నం తన భర్త జగ్గప్పదొరతో పాటు కూతురు చిట్రోతు నాగమణి, అల్లుడు ఏసుబాబుతో కలసి నివసిస్తోంది. నూకరత్నం దంపతులకు ఒక్క కూతురే కావడంతో దగ్గర బంధువైన రౌతులపూడికి చెందిన చిట్రోతు ఏసుబాబుతో వివాహం చేశారు. ఏసుబాబు తాపీ పని చేసుకుంటూ అత్త మామల వద్దే ఉంటున్నాడు. తాపీ పని అయ్యాక రోజూ సాయంత్రం మద్యం తాగి రోజూ ఇంటికి వచ్చేవాడు. భార్య నూకరత్నంతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు.

చుట్టుపక్కల వారు, గ్రామంలోని పెద్దలు ఎన్నిమార్లు చెప్పినా తరచూ ఘర్షణ పడుతూ ఉండేవాడు. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కొట్టేవాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చిన ఏసుబాబు భార్య నాగమణితో గొడవ పడ్డాడు. ఆమెను కొడుతుండగా అత్త నూకరత్నం (62) అడ్డుపడి వారించే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన ఏసుబాబు ఇంటి సమీపంలోని గునపంతో అత్త తలపై మోదాడు. ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావమై కిందపడి అపస్మారక స్థితిలోకి చేరుకుంది.

వెంటనే బాధితురాలిని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి సాయంతో రౌతులపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తీసుకెళ్లాలని సూచించారు. తిరిగి అదే ఆటోలో కాకినాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సినిమా సెంటర్‌కు వెళ్లే సరికి స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త జగ్గప్పదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుని రూరల్‌ సీఐ కిశోర్‌బాబు, కోటనందూరు, తొండంగి ఎస్సైలు అశోక్, విద్యాసాగర్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.