లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి

లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్‌ ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ డీజీ జితేందర్‌ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్‌ పోలీస్‌ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్‌క్వార్టర్లు, ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షల్లేవని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.