కొడుకుని కొట్టిన ట్యూషన్ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు

కొడుకుని కొట్టిన ట్యూషన్ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు

గురువు దండించడం అనాదిగా వస్తున్న మన పూర్వ విద్యావిధానంలో అత్యంత సాధారణ విషయం. కానీ ఈరోజుల్లో అది అమానుషం.. తీవ్ర నేరం కూడా అనేవారూ లేకపోలేదు. చిన్నారులను దండించడం ఫర్వాలేదు కానీ మరీ వాతలు కనిపించేలా.. శారీరక హింసకు గురిచేయడం సరికాదన్న అభిప్రాయాలున్నాయి. చదువు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ తమ కొడుకునో..కూతురినో కొడితే మాత్రం ఊరుకునేది లేదని చాలా మంది పేరెంట్స్ హెచ్చరికలు చేసిన ఘటనలు కూడా చూశాం. కానీ ఇది అంతకుమించి.హోం వర్క్ చేయలేదని కొడుకుని టీచర్ కొట్టిందని ఏకంగా పోలీసు కేసు పెట్టిన షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.

ఎస్సార్‌నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల మేరకు..కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో బాపూనగర్‌కి చెందిన ఎస్.రిమ్షానా తన కొడుకుని వెంగళరావు నగర్‌లో ఉండే మహిళా టీచర్ ఇంటికి ట్యూషన్‌కి పంపిస్తోంది. కొద్దిరోజుల నుంచి బాలుడు ట్యూషన్‌కి వెళ్లేందుకు భయపడుతుండడంతో తల్లి దగ్గరికి తీసుకుని అసలేం జరిగిందని ఆరా తీసింది. హోం వర్క్ చేయడంలేదని టీచర్‌ కొడుతోందంటూ ఎడమ చేతిపై అయిన గాయాలను చూపించడంతో తల్లి ఆగ్రహానికి గురైంది. వాతలు తేలేలా తన కొడుకుని కొట్టిన ట్యూషన్ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.