ఆస్తి అంతా తల్లికే చెందాలని యువకుడి సూసైడ్‌నోట్‌

ఆస్తి అంతా తల్లికే చెందాలని యువకుడి సూసైడ్‌నోట్‌

భార్య కాపురానికి రావడం లేదని మానసిక వేదనకు గురై మండలకేంద్రం వెల్గటూరుకు చెందిన గంట్యాల శ్రీధర్‌(35) అనే యువకుడు ఇంట్లో బుధవారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా..గ్రామానికి చెందిన శ్రీధర్‌కు రామడుగు మండలకేంద్రానికి చెందిన జలతో 2011లో వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రాగా పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఫలితంగా యువకుడు తాగుడుకు బానిసయ్యాడు. పదిరోజులక్రితం భార్య అతడిని వదిలేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మరింత తాగుడుకు బానిసై తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేవాడు.

ఈక్రమంలో రెండురోజులక్రితం అతడి భార్య మరో మహిళను వెంట తీసుకొచ్చి పిల్లలు పుట్టడం లేదని వైద్యపరీక్షలు చేయించుకోవాలని బెదిరింపులకు గురిచేశారు. రెండు రోజుల్లో కరీంనగర్‌ వచ్చి వైద్యపరీక్షలు చేసుకోవాలని లేదంటే నీ సంగతి చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారని మృతుడి తల్లి పేర్కొంది. అప్పటినుంచి తీవ్రంగా భయపడుతున్నాడు. భార్య తరపు బంధువులు బెదిరింపులకు గురి చేశారని ఫిర్యాదు చేయడానికి పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లగా ఎస్సై సాయంత్రం రావాలని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు.

భార్యతరపు బంధువులతో ప్రాణహాని ఉందనే భయంతోపాటు భార్య కాపురానికి రావడంలేదనే మానసిక వేదనతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తల్లి రాజేశ్వరి తెలిపారు. బెదిరంపులకు గురి చేసిన వారు వచ్చేదాకా మృతదేహాన్ని తీసేది లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎస్సై శ్రీనివాస్‌ సముదాయించి శవాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్‌రావు సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ‘తనకు చెందిన ఆస్తుల్లో భార్యకు ఎలాంటి వాటా ఇవొద్దని..అన్నీ తల్లికే చెందాలని.. నా మృతికి నా భార్య జలనే కారణమని ఆమెపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అలా అయితేనే నా ఆత్మ శాంతిస్తుందని’ శ్రీధర్‌ రాసిన సూసైడ్‌నోట్‌ అతడి జేబులో లభించింది.