నరేంద్రమోదీ కి భద్రతా వైఫల్యం

నరేంద్రమోదీ కి భద్రతా వైఫల్యం

పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ భద్రతా వైఫల్యంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ప్రధాని ట్రావెల్‌ రికార్డును భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఘటనపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పంజాబ్‌ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో ఘటన వెనుక అంతర్జాతీయ ఉగ్రవాదుల హస్తం ఉందని కేం‍ద్రం తమ వాదనలు వినిపించింది. ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు.

ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కేబినెట్‌ సెక్రటరీ సుధీర్‌ కుమార్‌ సక్సేనా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో ఐబీ జాయింట్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్, ఎస్‌పీజీ ఐజీ సురేశ్‌ సభ్యులు. సాధ్యమైనంతా వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. గత బుధవారం.. పంజాబ్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని మోదీ తీవ్రమైన భద్రతా వైఫల్యం కారణంగా అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.