Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తీపియుద్ధం కొనసాగుతోంది. మొన్నటిదాకా రసగుల్లా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చపెట్టగా… ఇప్పుడు మైసూర్ పాక్ వంతు వచ్చింది. రసగుల్లా మాదంటే మాదంటూ పశ్చిమ బంగ, ఒడిశా రాష్ట్రాల మధ్య జరిగిన తీపియుద్ధానికి , భౌగోళిక గుర్తింపు కేంద్రం ఫుల్ స్టాప్ వేయగా… ఇప్పుడు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు మైసూర్ పాక్ కోసం సోషల్ మీడియా వేదికగా మాటలయుద్ధానికి దిగాయి. మైసూర్ పాక్ భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ కోసం ఈ తీపియుద్ధం జరుగుతోంది. నిజానికి మైసూర్ పాక్ పేరులో ఉన్న మైసూర్ ను చూసి ఈ వంటకం కర్నాటక రాష్ట్రానికి చెందిందని అందరూ అనుకుంటారు. అలాగే కర్నాటక కూడా ఈ వంటకం తమదే అన్నట్టుగా ప్రచారం చేసుకునేది. కానీ పశ్చిమబంగ, ఒడిశా మధ్య రసగుల్లా కోసం జరిగిన తీపియుద్ధం తర్వాత సోషల్ మీడియాలో తమిళులు మైసూర్ పాక్ పై ప్రచారం మొదలుపెట్టారు.
1835లో బ్రిటిష్ అధికారి లార్డ్ మకౌలీ మైసూర్ పాక్ పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు. దాని ప్రకారం మద్రాస్ వాసులు మైసూర్ పాక్ తీసుకొచ్చినట్టు బెంగళూరుకు చెందిన ఒక స్నేహితుడు తనతో చెప్పారని మకౌలీ అన్నారట. అలాగే ఎన్నో ఏళ్లగా తమిళలు మైసూర్ పాక్ తయారుచేస్తున్నారని కూడా ఆ స్నేహితుడు మకౌలీతో చెప్పారట. అయితే 74 ఏళ్ల క్రితం ఓ న్యాయవాది మైసూర్ పాక్ తయారీ విధానాన్ని దొంగలించి మైసూర్ రాజుకు ఇచ్చాడని, ఆ రాజసంస్థానం పేరుమీదే మైసూర్ పాక్ వచ్చిందని వివరించాడట. ఈ విషయాన్ని మకౌలీ స్వయంగా కొందరితో చెప్పాడని తమిళలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంచేస్తున్నారు. పనిలో పనిగా మైసూర్ పాక్ మాదేనని వాదిస్తున్నారు. అయితే కన్నడిగులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. నాల్గొవ కృష్ణరాజ్ వడయార్ కాలంలో మైసూర్ ప్యాలెస్ కిచెన్ లో ఈ వంటకాన్ని మొదటగా తయారుచేసినట్టు కన్నడిగులు చెబుతున్నారు. మరి ఎవరి వాదనలో నిజముందో… నోట్లో వేసుకుంటే కరిగిపోయే తియ్యని మైసూర్ పాక్ కు ఎవరిపేరిట జీఐ ట్యాగ్ లభిస్తుందో వేచి చూడాలి.