Telangana Speaker Election: స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. 14న ఎన్నిక..

Political Updates: Finance Department's White Paper before the Legislature tomorrow..
Political Updates: Finance Department's White Paper before the Legislature tomorrow..

తెలంగాణలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది మినహా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం శాసనసభ సచివాలయం కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 14న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 10.30 గంటలకు కొత్త స్పీకర్‌ను ప్రకటిస్తారు. 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కీలక స్పీకర్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ పేరు ఖరారైంది. ఆయన్ను స్పీకర్ గా నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి జి.ప్రసాద్ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మెటుకు ఆనంద్‌పై 12,893 ఓట్ల మెజారిటీతో భారత్ రాష్ట్ర సమితిపై విజయం సాధించారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 73,992 ఓట్లు వచ్చా యి. 2009లో జీ ప్రసాద్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్ కేటాయించింది. ఈసారి 12 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ముందుగా ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. స్పీకర్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. స్పీకర్ పదవి చేపట్టేందుకు శ్రీధర్ బాబు ఆసక్తి చూపడం లేదు. మంత్రిగా పని చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా నియమించింది.