విజయవాడలో దర్శనమిస్తున్న టు–లెట్‌ బోర్డులు

విజయవాడలో దర్శనమిస్తున్న టు–లెట్‌ బోర్డులు

విజయవాడలో వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి దిగే వారే కరువయ్యారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్చి మూడో వారం నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. పరిశ్రమలు, షాపులు, విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఉపాధినిచ్చే అనేక రంగాలు మూతపడ్డాయి. దీంతో వాటిలో ఉపాధి పొందుతున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన అనేకమంది తాము ఉంటున్న అద్దె ఇళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు.

వీరిలో బ్యాచిలర్లుగా ఉంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సింగిల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్లు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దాదాపు మూడు నెలల నుంచి నగరంలోని అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం సడలింపులతో పరిశ్రమలు, షాపులు, హోటళ్లు వంటి వివిధ సంస్థలు తెరచుకోవడానికి అనుమతినిచ్చినా అవి పూర్వ స్థితికి చేరుకోలేదు. స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు అరకొరగా తప్ప పూర్తిస్థాయిలో వెనక్కి రాలేదు.

మరోవైపు విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. దాదాపు అన్ని డివిజన్లనూ కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో బెజవాడలో ఎటు చూసినా టు–లెట్‌ బోర్డులు వేలాడదీసిన అద్దె ఇళ్లు అనేకం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అద్దె ఇళ్ల కోసం గాలించడం ప్రహసనంగా మారేది. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన కొంతమంది రెంటల్‌ ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలోని ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ టు–లెట్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇల్లు కావాలని అడిగే వారే కరువయ్యారని ఇంటి యజమానులు ఆవేదన చెందుతున్నారు.