అజయ్ కి అవకాశాల వెల్లువ !

ఒక నలుగురు ఐదుగురు నటులు మినహా మిగతా అందరూ కొత్త వాళ్లను పెట్టి తీసిన RX 100తో సంచలన విజయం సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయట. చిన్నబడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికే పది కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. దీంతో దీనికి భారీ వసూళ్లు ఖాయమని చెప్పాలి. ఇలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా అజయ్ కి అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయని సమాచారం.

ఇతడితో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారని సమాచారం వారిలో స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, భవ్య క్రియేషన్స్ వంటి పెద్ద వాళ్ళు ఆ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తమ తోనే చేయాలని పట్టు పడుతున్నారట. రామ్ హీరోగా తీయడానికి తగిన సబ్జెక్ట్ తో రావాలని రవికిషోర్ అజయ్ భూపతికి సూచించినట్టుగా సమాచారం. అలాగే నితిన్ తండ్రి అయిన సుధాకర్ రెడ్డి తన తనయుడికి తగిన కథతో రావాలని సూచించారట. అలాగే భవ్య క్రియేషన్స్ సంస్థ కూడా అజయ్ భూపతిని సంప్రదించాలని అతడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ఒక్క సినిమాతోనే అజయ్ జాక్పాట్ కొట్టాడు.