మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ గత సంవత్సరం ప్రారంభం అయ్యింది. కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆలస్యం అయ్యింది. దాంతో మొదట అనుకున్నట్లుగా వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్మాత రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాస్త నిధానంగానే సినిమాను పూర్తి చేసి, వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. రంగస్థలం చిత్రం వేసవి ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే సైరాను కూడా అలాగే విడుదల చేయాలని చరణ్ నిర్ణయించాడు. జనవరి లేదా ఫిబ్రవరి వరకు సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది. అందుకే ఏప్రిల్‌లో ఖచ్చితంగా సినిమాను విడుదల చేయవచ్చు.
ఏప్రిల్‌లో మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలో తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించాడు. ఇలాంటి సమయంలో మహేష్ 25వ మూవీ మహర్షి మరియు చిరు 151వ మూవీ సైరాలు క్లాష్ అవుతాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. సినిమా విడుదలకు ఇంచా చాలా సమయం ఉంది. అయినా కూడా ఇప్పటి నుండే రెండు సినిమాల మద్య గ్యాప్ కోసం చరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. అందుకే సైరా మూవీ కోసం మహేష్‌బాబు 25వ చిత్రం వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. వారం లేదా రెండు వారాలు ఆలస్యంగా మహర్షి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్‌కు చరణ్‌తో మంచి స్నేహం ఉంది. అందుకే చరణ్ చెప్పినదానికి ఓకే చెప్పే అవకాశం ఉంది.