అనంత మహిళా వాలంటీర్ కు షాక్.. ఒప్పుకోకపోతే తీసేస్తామని వేధింపులు..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని చట్టాలు తెస్తున్నా ఇంకా లైంగిర వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురంలో ఓ ఘటన చోటుచేసుకుంది. గ్రామ మహిళా వాలంటీర్‌ను వేధించిన కేసులో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఓ ఘటన వెలుగు చూసింది. మండలంలోని దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఓ యువతి వాలంటీర్‌గా పనిచేస్తోంది. కొద్దిరోజులుగా అధికార పార్టీకి చెందిన నేతలు తనను వేధిస్తున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కూడా గ్రామ కార్యదర్శితో కలసి రాజకీయ నాయకులు వేధించారని ఫిర్యాదులో ఆ యువతి వివరించింది. అంతేకాకుండా తాము షేవింగ్‌ చేయించుకోవాలనీ, బార్బర్ షాపు తెరిచి ఉందో లేదో చూసి రావాలని, పిలిచినప్పుడల్లా తమ ఇంటికి వచ్చిపోవాలని అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గ్రామ కార్యదర్శి అమర్‌‌తో పాటు అధికార పార్టీ నేతలు శివారెడ్డి, కాటమయ్య, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్‌ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.