మహిళల వివాహ వయసు పెంపు

మహిళల వివాహ వయసు పెంపు

మహిళల వివాహ వయసు పెంపు బిల్లును అధ్యయనం చేయడానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో ఒకే ఒక్క మహిళ ఎంపీకి స్థానం దక్కింది. మొత్తం 31 మంది పార్లమెంటు సభ్యులున్న కమిటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ సుస్మితా దేవ్‌‌ను సభ్యురాలిగా నియమించారు. మహిళల కోసం ఉద్దేశించిన బిల్లును పరిశీలించి సిఫార్సులు చేయడానికి ఏర్పాటుచేసిన కమిటీలో వారికే సరైన ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని.. మా అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది .

టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.బిల్లుపై చర్చించడానికి మహిళా ఎంపీలను ఎంపిక చేసే అధికారం కమిటీ చైర్మన్‌కు ఉంటుందని ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె అన్నారు. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశంలో కేంద్రం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు చట్టంగా మారలంటే హిందూ, క్రిస్టియన్‌, ముస్లిం తదితర వివాహ చట్టాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది.

కేంద్రం పెట్టిన బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును అనేక రాజకీయ పార్టీలు, పలు మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి లోక్‌సభ నివేదించింది. బీజేపీ ఎంపీ వినయ్ శహస్రాబ్దేను ఛైర్మన్‌గా నియమించింది. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ప్రతిపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చారు.

‘మన దేశంలో స్త్రీల సమానత్వాన్ని వివాహ వయస్సులో చూడాలి.. విభిన్న విశ్వాసాల వివాహ చట్టాలకు సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నాం… ఈ సవరణ 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడానికి పురుషులతో పాటు మహిళలకు సమానత్వాన్ని ఇస్తుంది. దీని వల్ల 2.1 మిలియన్ల బాల్య వివాహాలు అడ్డుకోవచ్చని, చాలా మంది తక్కువ వయస్సు గల బాలికలు గర్భవతిగా ఉన్నట్లు మా పరిశోధనలో తేలింది. కాబట్టి మీరు సమానత్వం హక్కును అడ్డుకుంటున్నారు’ అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.