అంతర్జాతీయ ఘనత సాధించిన కూలీ కొడుకు

అంతర్జాతీయ ఘనత సాధించిన కూలీ కొడుకు

హైదరాబాద్‌కు చెందిన యువ నావికుడు అంతర్జాతీయ ఘనత సాధించాడు. ఇటలీలో జరగబోయే ఆప్టిమిస్ట్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌కు 15 ఏళ్ల నావికుడు పాడిదళ విశ్వనాథ్ ఎంపికయ్యాడు. ఇతను గోవాలోని ఐఎన్ఎస్ మాండోవిలోని నేవీ బాయ్స్ స్పాట్స్ కంపెనీలో శిక్షణ పొందుతున్నాడు.

ఇటలీలోని రివా డెల్ గార్డాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించే జూనియర్ బాయ్స్‌ యాచింగ్ జట్టులో విశ్వనాథ్‌ పాల్గొననున్నాడు. ఈ పోటీలు జూన్‌ 30న ప్రారంభమై..జూలై 10న ముగియనున్నాయి.

విశ్వనాథ్‌ నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. సూర్యపేటకు చెందిన ఇతని తల్లిదండ్రులు నిర్మాణ రంగంలో దినసరి కూలీలు. 21 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఇక విశ్వనాథ్‌ను తన 12వ ఏటలోనే నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ఎంపిక చేసింది. ఇంతకముందు 2017లో సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ రెగట్టాలో రజత పతకం సాధించాడు.

అప్పటి నుంచి ఆప్టిమిస్ట్ తరగతిలో జాతీయ జట్టులో పాల్గొంటున్నాడు.ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌, ఒలంపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించడమే తన లక్ష్యమని విశ్వనాథ్‌ తెలిపాడు. ప్రొఫెషనల్ నావికుడు కావాలనే తన కల త్వరలోనే నిజం కాబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. 12ఏళ్ల వయస్సులో తనను ఎంపిక చేసినందుకు నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు.