గొంతులు కోసుకున్న యువకులు

young men throat cut

హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లోని ఓ హోటల్ గదిలో దిగిన ఇద్దరు స్నేహితులు ఒకరి గొంతు మరొకరు కోసుకొన్నారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ ముంబైలో చదువుతున్న ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కొండా శ్రీకాంత్ (29), మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం మూసల్‌పూర్‌కు చెందిన డబ్బి నరేశ్(26) బుధవారం సాయత్రం ఎస్సార్‌నగర్‌లోని క్రిష్‌ఇన్ లాడ్జిలో దిగారు. సాయంత్రం 5 గంటలకు వీరు బయటకు వెళ్లివచ్చారు. గురువారం ఉదయం నుంచి వీరు తలుపులు తీయలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది సాయంత్రం మాస్టర్‌కీతో తలుపులు తెరిచారు. గదిలోని బాత్రూంలో శ్రీకాంత్, నరేశ్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీకాంత్, నరేశ్ గొంతులు కోసుకుని ఉన్నట్టు గుర్తించారు.