సీఎం కుర్చీ వద్దంటున్న రాజులు.

Digvijay Singh is preparing for six month padayatra in Madhya Pradesh.,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దిగ్విజయ్ సింగ్ …ఈయన గురించి 10 ఏళ్ళ పాటు సీఎం గా పని చేసిన మధ్య ప్రదేశ్ లో ఎలా పరిచయం అవసరం లేదో తెలుగు ప్రజలకు కూడా అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయన పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా వున్నప్పుడే ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు విభజన పాపం ఆయన మీదే పడింది. అందుకే దిగ్విజయ్ ఏపీ లో ది మోస్ట్ ఆన్ వాంటెడ్ పర్సన్ . సోనియా ఆదేశాన్ని అమలు చేసి విభజన పాపాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఆయన కూడా ప్రైవేట్ సంభాషణల్లో ఆవేదన పడుతుంటారట. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు . ఈ వయసులో దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ లో భారీ పాదయాత్ర కి సిద్ధం అవుతున్నారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని దగ్గరగా చూసిన దిగ్విజయ్ కి పాదయాత్రల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ?. వై.ఎస్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి రాచబాట వేసింది, ఇక గెలుపు సాధ్యమా అనుకున్న దశలో సుదీర్ఘ పాదయాత్రతో బాబు మళ్ళీ సీఎం అయ్యింది దిగ్విజయ్ గమనించారు. అందుకే మధ్యప్రదేశ్ లో బీజేపీ చేతిలో చావు దెబ్బ తింటున్న కాంగ్రెస్ కి పునరుత్తేజం కల్పించేందుకు ఆయన ఈ బాటనే ఎంచుకున్నారు. వై.ఎస్, చంద్రబాబు తరహాలో పాదయాత్ర తలపెట్టిన దిగ్విజయ్ వయసులో ఆ ఇద్దరి కన్నా పెద్ద. పైగా 70 ఏళ్ళ వయసులో నర్మదా పరిక్రమ యాత్ర పేరుతో ఈ పాదయాత్ర తలపెట్టారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం దిగ్విజయ్ తలపెడుతున్న పాదయాత్ర హాట్ టాపిక్. దాదాపు 6 నెలల పాటు సాగే ఈ పాదయాత్ర తో కాంగ్రెస్ దశ, దిశ మారిపోతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశపడుతున్నాయి. అయితే ఢిల్లీ రాజకీయాల్లో ప్రయోజనం లేదని తెలిసాక ఎంపీ లో మళ్ళీ సీఎం పదవి కోసమే దిగ్విజయ్ ఈ యాత్ర తలపెట్టారన్న విమర్శలు కూడా లేకపోలేదు. తాను సీఎం రేసులో లేనని దిగ్విజయ్ చెబుతున్నప్పటికీ ఆయన మాటల్ని సాటి కాంగ్రెస్ నాయకులే నమ్మడం లేదు. దిగ్విజయ్ పాదయాత్ర మీద ఓ అంచనాకి వచ్చిన అదే రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ఇంకో ప్రకటన చేశారు. తాను సీఎం పదవి ఆశించడం లేదని , జ్యోతిరాదిత్య సింధియా సీఎం అభ్యర్థి అని ఆ ప్రకటన సారాంశం. అటు జ్యోతిరాదిత్య కూడా తనకు సీఎం పదవి మీద పెద్ద ఆసక్తి లేదు అంటున్నారు.
రాజకుటుంబాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న ఈ రాజులు సీఎం పదవి గురించి ఇలా అనడం ఆశ్చర్యమే . ఎక్కడైనా పదవి కోసం కొట్లాడుకునే రాజకీయాలు చూస్తాం. మధ్య ప్రదేశ్ లో మాత్రం సీఎం పదవి వద్దంటూనే రాజకీయాలు చేస్తున్న రాజుల్ని చూస్తున్నాం. మొత్తానికి ప్రస్తుత రాజకీయాల్లో ఇది కాస్త డిఫరెంట్ పరిణామమే.