మహా టీవీ ఇకపై యమహాగా వస్తుందా?

Mahaa Tv Channel to Speed Up

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కాక ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి సందిగ్ధంలో పడింది . దానికి తోడు తెలుగులో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడిన న్యూస్ ఛానెల్స్ కూడా ముయ్యాలేకా, నడపాలేకా ఇబ్బంది పడుతున్నాయి. టైం కి జీతాలు ఇవ్వలేక కొన్ని ఛానెల్స్ ఉద్యోగుల ముందు చులకన అయ్యాయి. ఇంకొన్ని యాజమాన్యాలు ఆ కాస్త సిగ్గు విడిచి జర్నలిస్టుల మీదే ప్రకటనలు తేవాలని ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఏదో ఒకటి రెండు పెద్ద ఛానెల్స్ విషయం ఏమో గానీ ఈ ఫార్ములా మిగిలిన ఛానెల్స్ విషయంలో పని చేయడం లేదు. దీంతో ఎన్నో ఛానెల్స్ మూసివేతకు సిద్ధంగా వున్నాయి. ఈ కోవలో ఎప్పటినుంచో వున్న మహా టీవీ జాతకం మాత్రం మారిపోతోందట.

ఐ వెంకటరావు లాంటి దిగ్గజ జర్నలిస్ట్ సారధ్యంలో మొదలైన మహా టీవీ కి ఆది నుంచి టీడీపీ నేత సుజనా చౌదరి ఆర్ధికంగా అండదండలు అందించిన విషయం బహిరంగ రహస్యమే. వచ్చిన కొత్తల్లో మహా పోటీ ఛానెల్స్ కి దీటుగా కనిపించింది .కానీ కాలం గడిచేకొద్దీ అనుకున్న ఆర్ధిక ఫలాలు రాకపోవడంతో సీన్ మారిపోయింది. రోజురోజుకి పరిస్థితులు దిగజారాయి. ఐ వెంకటరావు, ఆయన కుమారుడు ఎంత కష్టపడ్డా మహా టీవీ గాడిలో పడలేదు. సుజనా చౌదరి కూడా ఆర్ధిక సాయం ఆపేశారట. దీంతో ఆ ఛానల్ నడిపించలేక, మూసివేయలేక వెంకటరావు గారు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా అదృష్టం విదేశీ పెట్టుబడి రూపంలో వచ్చిందట.

ఓ nri మహా టీవీ లో 51 శాతం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. వాటా తీసుకోవడంతోటే పాటు వెంటనే ఆ ఛానల్ ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారట. ఈ ఛానల్ ఆంధ్ర బేస్డ్ గా పని చేస్తుందట. అందుకే అక్కడున్న టీం ని కూడా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. ఇది కొద్ది మందికి కాస్త ఇబ్బంది కలిగించినా మొత్తానికి జర్నలిస్ట్ లకి ఇది నిజంగా శుభవార్త.