పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు

పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు

వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా, మౌనీరాయ్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది.

చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్‌లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియాభట్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.