శ్రీ సత్య సాయి అవతార తత్వం

శ్రీ సత్య సాయి అవతార తత్వం

హైదరాబాద్ ఏప్రిల్ 14, (తెలుగు బుల్లెట్) భగవంతుడు భూమి మీద అవతరించటానికి ఒక స్థలాన్ని,ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ స్థలం పుట్టపర్తి. ఆ వ్యక్తి ఈశ్వరమ్మ. అలాగే ఒక నామధేయాన్ని కూడా.ఆ పేరే సత్యసాయిబాబా. భక్తులు ఆర్తిగా పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా.

ప్రేమ, శాంతి, దయ, ధర్మం, అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్బోదించి, తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేస్తున్న అపర భగవానుడు. ఆయన భోధనలు మానవాళికి మార్గదర్శనాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన మార్గం దైవ మార్గం. మన కోసం మన మధ్యే నడయాడుతున్న దైవ స్వరూపం.

ప్రపంచమంతా ఒక్కటయ్యే మధుర క్షణం మనందరి కోసం వేచి ఉందని, మనుషులంతా దానికోసం కలిసి కట్టుగా పాటుపడాలనీ ఆయన ఉపదేశించారు. మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు.

ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. నా మార్గంలో గాని, మరో మార్గంలో గాని శిష్యులను, భక్తులను ఆకర్షించడం నా అభిమతం కాదు…. విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం – ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత – ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. … తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని వీడమనీ ప్రతి మతం ఉద్బోధిస్తుంది.

వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవడాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాలలోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతునే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుని ఆరాధించడానికి అత్యుత్తమమైన మార్గం.

ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్య భావాన్ని అవగతం చేసుకోండి. (4 జూలై 1968) ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసుకొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు.