సిని ఇండస్ట్రీకి గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ షురూ…..

టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కీలకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగింది. ఈ భేటీ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ.. షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలనే దానిపై మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే.. ప్రభుత్వం అన్ని రంగాలకు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తోందని తెలిపిన ఆయన సినీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహం అందరిలోనూ నెలకొని ఉందని వివరించారు.

అదేవిధంగా.. సినిమా షూటింగులను ప్రారంభించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని తెల్పిన ఆయన కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం అంగీకారంతో షూటింగులు జరుపుకోవాలనేది తమ అభిమతంగా వెల్లడించారు. కాగా ఇది కేవలం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో.. లేదా షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల కోసమో తాము చేస్తున్న విన్నపం కాదని… షూటింగులు జరిగితే కానీ.. సినిమాపై ఆధారపడి బ్రతుకున్న వారి జీవితాలు ముందుకు సాగవని తెలిపారు. అలాగే.. 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపంగా ఆయన కోరారు. 14 వేల మందిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరుతున్నామని తెలిపారు.

అందేవిధంగా ఇదే సమయంలో పరిశ్రమలోని సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాగా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని.. వాటికి అనుమతి ఇస్తున్నట్టుగా తలసాని చెప్పడంతో సినిమా ఇండస్ట్రీకి కొంత ఊరట లభించింది. నిర్మాణం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు ఇక చకచకా ఈ పనులు జరుపు కోబోతున్నాయనే చెప్పాలి. కాగా ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సి. కల్యాణ్ తదితరులు హాజరరు కావడం విశేషం.