వృద్ధురాలిని చంపేసిన చిరుత

తెలంగాణలోని హైదరాబాద్ శివారుల్లో ఈ మధ్య చిరుత తరచూ తిరుగుతూ ఉంది. కానీ… ఇంకా అటవీశాఖ అధికారులకు మాత్రం చిక్కలేదు. దాన్ని పట్టుకొనేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం హిమాయత్ సాగర్ అటవీ ప్రాంతంలో చిరుతను చూసినట్టు మత్స్యకారులు అధికారులకు సమాచారం అందించారు. హిమాయత్ సాగర్ ఫారెస్ట్ నుంచి చిలుకూరు అడవుల్లోకి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే హిమాయత్ సాగర్ వెళ్లి ఆనవాళ్లు పరిశీలించిన అధికారులు… చిలుకూరు అటవీ ప్రాంతంలోకే వెళ్లినట్టు నిర్ధారించారు. చిరుత సురక్షితంగా అటవీ వైపు వెళ్లిపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించినప్పటికీ…. చిరుత ఆచూకి కోసం గాలిస్తున్నారు.

అదేవిధంగా.. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలిని అతి దారుణంగా చంపేసింది చిరుత. తవరేకేరి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొట్టగణహల్లి గ్రామానికి చెందిన 68 ఏళ్ల గంగమ్మ.. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన సమయంలో.. ఆమెపై చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది.. వృద్ధురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా చిరుత ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బెంగళూరు సమీపంలో 10 రోజుల్లోనే ఇది రెండో ఘటన. గత కొద్ది రోజుల క్రితమే కదిరైహన పాల్యలో మూడేళ్ల బాలుడు హేమంత్‌పై చిరుత దాడి చేయడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు తీవ్రస్థాయిలో భయాందోళనకు గురౌతున్నారు.