వరకట్న వేదింపులకు మరో యువతి బలి

వరకట్న వేదింపులకు మరో యువతి బలి

పెళ్ళి సమయంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని భార్యను ఓ కిరాతక భర్త ప్రతి రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు తట్టుకోలేక కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుని రెండురోజులు విలవిలలాడి మరణించింది. ఈ దారుణ సంఘటన కేఆర్‌ నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలు కేఆర్‌ నగరంలోని హెబ్బాలు గ్రామానికి చెందిన భారతి (25). ఆ శాడిస్టు భర్త శ్రీధర్‌ (32) డిఏఆర్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వివరాలు ఈ ఇద్దరికి ఆరు సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో 200 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఒక బైకు ఇచ్చి వైభవంగా పెళ్లిని జరిపించారు.

కొంతకాలం తరువాత ఇంటి స్థలం కూడా ఇస్తామని అల్లునికి హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్న భర్త కొంతకాలం నుంచి భార్యపై పగబట్టాడు. ఇంటి స్థలం రాసివ్వాలని ప్రతిరోజు వేధించేవాడు. ఆమె తల్లిదండ్రులతో అనేకసార్లు గోడు వెళ్లబోసుకుంది. త్వరలోనే స్థలం ఇప్పిస్తామని నచ్చజెప్పేవారు. కానీ కిరాతక భర్త పీడించడం మాత్రం వదల్లేదు. శుక్రవారం రాత్రి కూడా డ్యూటీ నుంచి రాగానే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర విరక్తి చెందిన ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను మైసూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆమె కుటుంబ సభ్యులు శ్రీధర్‌ పైన ఫిర్యాదు చేయడంతో కేఆర్‌ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.