ఫేస్ బుక్ లో యువతి నెంబర్… రాత్రికి వస్తావా?.. రేటెంత? అంటూ వేధింపులు

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన కొంతమంది ఆకతాయిలు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. కొందరేమో మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తుంటే.. మరికొందరేమో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ లో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. తన ఫోన్ నంబర్.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఘటనపై ఓ యువతి హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలామంది తనకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

కాగా సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ యువతికి కొన్ని రోజులుగా రోజూ పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. కొందరేమో ప్రేమిస్తున్నామని వేధిస్తుంటే.. మరికొందరు ఏకంగా రాత్రికి వస్తావా? రేటెంత? అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది. మీకు నా నంబర్ ఎవరిచ్చారు అని యువతి ప్రశ్నిస్తే… ఆమెకు ఫేస్‌బుక్‌లో చూశామని చెప్తున్నారు. కాగా రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన యువతి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరో తన ఫోన్ నంబర్ సోషల్‌ మీడియాలో పెట్టారని, దీంతో అనేక మంది తనకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.